Ticker

6/recent/ticker-posts

వివాదాస్పదరీతిలో భారత్-బంగ్లాదేశ్ ఫైనల్.. హద్దులు దాటిన బంగ్లా ఫ్యాన్స్

దక్షిణాసియా అండర్-19 మహిళల ఫుట్‌బాల్ టోర్నమెంట్ భారత్-బంగ్లాదేశ్ ఫైనల్ గందరగోళంగా ముగిసింది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న ఈ తుదిపోరులో చివరికి ఇరు జట్లను సంయుక్తంగా విజేతగా ప్రకటించారు. అసలేం జరిగిదంటే...

భారత్-బంగ్లా ఫైనల్ హోరాహొరీగా సాగింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికీ ఇండియా గోల్ సాధించింది. 8వ నిమిషంలో షిబానాదేవి గోల్ కొట్టి శుభారంభం చేసింది. భారత్ అదే జోరును కొనసాగిస్తూ ఫస్ట్ హాఫ్‌ను 1-0తో ముగించింది. సెకండ్ హాఫ్‌లో బంగ్లాదేశ్‌ పుంజుకుంది. బంగ్లా ప్లేయర్ సగోరిక గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేసింది. దీంతో మ్యాచ్ ఫలితం పెనాల్టీ షూటౌట్‌కు దారితీసింది.

పెనాల్లీ షూటౌట్ ఆసక్తికరంగా సాగింది. షూటౌట్‌లో కూడా భారత్, బంగ్లా 5-5తో సమంగా నిలిచాయి. దాంతో షూటౌట్‌ను కొనసాగించారు. గోల్‌కీపర్లతో సహా 11 మంది గోల్స్‌ చేయడంతో ఇరు జట్ల స్కోరు 11-11తో సమమైంది. ఇలాంటి సందర్భాల్లో ఫలితం తేలేవరకు షూటౌట్‌ను కొనసాగిస్తారు. కానీ మ్యాచ్ రిఫరీ షూటౌట్‌ను ఆపేసి, ఇరు జట్ల కెప్టెన్లను పిలిచి టాస్ వేసి విజేతను నిర్ణయించారు. టాస్‌లో భారత్‌కు అదృష్టం వరించింది. దీంతో ఇండియాను విజేతగా ప్రకటించారు.

బంగ్లాదేశ్ జట్టు ఈ ఫలితాన్ని అంగీకరించలేదు. స్టేడియంలోనే నిరసనకు దిగారు. గంటన్నర దాటినా అక్కడి వాతావరణంలో మార్పు రాలేదు. మరోవైపు బంగ్లాదేశ్ అభిమానులు భారత ప్లేయర్లపై నీళ్ల బాటిళ్లు విసురుతూ హద్దులు దాటారు. దీంతో భారత్ జట్టు మైదానాన్ని వీడి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లింది. వివాదం సద్దుమణగకపోవడంతో చివరికి భారత్-బంగ్లాదేశ్ ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు.

అయితే టాస్ ఫలితాన్నిఒప్పుకోని బంగ్లాదేశ్ అసలు టాస్‌కు ఎందుకు వచ్చిందని భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందే తమ నిర్ణయాన్ని తెలిపితే గౌరవంగా ఫైనల్ మ్యాచ్ ముగిసేదని అంటున్నారు.