Ticker

6/recent/ticker-posts

U19 World Cup: సెమీఫైనల్లో పాకిస్థాన్ తడబాటు.. ఆసీస్ లక్ష్యం ఎంతంటే..?


 అండర్ 19 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్ బ్యాటర్లు తడబడ్డారు. సంచలన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన దాయాదీ దేశం.. కీలక పోరులో మాత్రం చేతులెత్తేసింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 48.5 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది.


పాకిస్థాన్ బ్యాటర్లలో అజాన్ అవైస్(91 బంతుల్లో 3 ఫోర్లతో 52), అరఫత్ మిన్‌హాస్(61 బంతుల్లో 9 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగితా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టామ్ స్ట్రాకర్(6/24) ఆరు వికెట్ల‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. మహ్లీ బియర్డ్‌మన్, కల్లమ్ విడ్లేర్, రాఫ్ మెక్‌మిలాన్, టామ్‌ కాంప్‌బెల్ తలో వికెట్ తీసారు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఆచితూచి ఆడిన ఓపెనర్ షామిల్ హుస్సేన్(17)ను స్ట్రాకర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే మరో ఓపెనర్ షెహ్‌జైబ్ ఖాన్(4)ను కల్లమ్ విడ్లేర్ ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో అజాన్ అవైస్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. కెప్టెన్ సాద్ బైగ్(3), అహ్మద్ హసన్(4), హరూన్ అర్షద్(80 వరుసగా పెవిలియన్ చేరారు. దాంతో పాక్ 79 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది.


ఆ జట్టు ఆటతీరు చూసి 100 పరుగులైనా చేస్తుందా? అని అనుకున్నారు. కానీ ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అరఫత్ మిన్‌హాస్.. అజాన్ అవైస్‌తో కలిసి ధాటిగా ఆడాడు. బౌండరీలతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరోవైపు అజాన్ సైతం పరుగులు రాబట్టడంతో పాక్ ఇన్నింగ్స్ గాడినపడింది. ఈ క్రమంలో అజాన్ 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.


54 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని టామ్ స్ట్రాకర్ విడదీసాడు. అజాన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. నవీద్ అహ్మద్ ఖాన్‌తో కలిసి 60 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అరఫత్.. ధాటిగా ఆడే క్రమంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ వికెట్‌ తర్వాత 15 పరుగుల వ్యవధిలోనే పాకిస్థాన్ చివరి 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులోకి వచ్చిన ఉబైద్ షా(6), మహమ్మద్ జీషన్(4), అలీ రాజా(0) ఆసీస్ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు.


పాకిస్థాన్ బ్యాటింగ్ వైఫల్యంతో భారత అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్ ఫైనల్ చేరగా.. రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్ గెలవాలని కోరుకున్నారు. అప్పుడు ఫైనల్లో భారత్Xపాక్ పోరు చూడవచ్చని భావించారు. కానీ పాక్ తడబడుతుండటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.