ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 244 పరుగులు చేసింది. లూన్ డ్రీ ప్రిటోరియస్(102 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76), రిచర్డ్ సెలెట్జ్‌వేన్(100 బంతుల్లో 4 ఫోర్లతో 2 సిక్స్‌లతో 64) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లో రాజ్ లింబాని మూడు వికెట్లు తీయగా.. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రెండు, నమన్ తివారీ, సామీ పాండే తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యం చేధనకు దిగిన భారత్ 48.5 ఓవర్లలో 7 వికెట్లకు 248 పరుగులు చేసి గెలుపొందింది. అసాధారణ ప్రదర్శన కనబర్చిన సచిన్ దాస్(95 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 96) తృటిలో శతకం చేజార్చుకోగా.. ఉదయ్ శరణ్ సింగ్( 124 బంతుల్లో 6 ఫోర్లతో 81 ) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు.
సౌతాఫ్రికా బౌలర్లలో ట్రిస్టన్ లూస్(3/37), క్వెనా మఫకా (3/32) మూడేసి వికెట్లు తీసారు. బుధవారం ఆస్ట్రేలియా వర్సెస్ పాక్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్లో విజేతగా నిలిచే జట్టుతో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఆదిలో గట్టి షాక్..
245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ ఆదర్శ్ సింగ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ కొద్దిసేపటికే ఇన్‌ఫామ్ బ్యాటర్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్(4) ఔటయ్యాడు. దాంతో టీమిండియా 8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో కెప్టెన్ ఉదయ్ శరణ్, అర్షిణి కులకర్ణి(12) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఈ జోడీ పూర్తిగా డిఫెన్స్‌కు పరిమితమవ్వగా.. అర్షిణి కులకర్ణిని సఫారీ బౌలర్ లూస్ ఔట్ చేసి దెబ్బతీసాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ 3 వికెట్లకు 26 పరుగులు మాత్రమే చేసింది. ప్రియాన్షు మోలియా(5) కూడా ఔటవ్వడంతో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన సచిన్ ధాస్‌తో కెప్టెన్ ఉదయ్ శరణ్ ఇన్నింగ్స్ నిర్మించాడు.
ఆదుకున్న సచిన్ దాస్, ఉదయ్ శరణ్
ఉదయ్ శరణ్ ఆచితూచి ఆడగా... సచిన్ దాస్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వరుస బౌండరీలతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్ది సేపటికే ఉదయ్ శరణ్ సైతం 88 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో భారత్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు.
చేజారిన సచిన్ శతకం..
కానీ శతకానికి చేరువైన సచిన్ దాస్(96)ను క్వెనా మఫక ఔట్ చేయడంతో ఐదో వికెట్‌కు నమోదైన 171 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. భారత్ విజయానికి బంతికి ఒక్క పరుగుల చేయాల్సి రాగా.. క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం అరవెల్లి అవనీష్(10) సాయంతో ఉదయ్ శరణ్ జట్టును విజయం దిశగా నడిపించాడు.
భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అవనీష్ క్యాచ్ ఔటవ్వగా.. క్రీజులోకి వచ్చిన అభిషేక్(0) రనౌటయ్యాడు. దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. క్రీజులో వచ్చిన రాజ్ లింబాని సిక్స్ బాదడంతో భారత్ విజయానికి 12 బంతుల్లో 9 పరుగులు అవసరమయ్యాయి.
49వ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించి ఉదయ్ శరణ్ ఒత్తిడి తగ్గించాడు. సఫారీ బౌలర్ 2 వైడ్లు వేయంతో మ్యాచ్ టై అయ్యింది. విజయానికి ఒక్క పరుగు కావాల్సిన సమయంలో ఉదయ్ శరణ్ రనౌటవ్వగా.. రాజ్ లింబాని బౌండరీ బాది భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
Social Plugin